Pawan-ChandraBabu-Modi-Jagan
లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ తన బలాలు, బలహీనతల మీద ద్రుష్టి పెట్టింది. ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్న బీజేపీ, దక్షిణ భారతదేశంలో ఒక్క కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాలలో బలహీనంగా ఉందనేది వాస్తవం. జనవరి 22, సోమవారం నాడు అయోధ్యలో జరిగిన రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో దక్షిణ భారత రాష్ట్రాల నుండి చాలా మంది ప్రాంతీయ పార్టీ నాయకులు కనిపించలేదు.
ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన మిత్రపక్షమైన జనసేన పార్టీ (జేఎస్పీ) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా గైర్హాజరయ్యారు. అయోధ్య వెళ్ళడానికి తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని ఆయన కుమార్తె కె కవిత జనవరి 21 ఆదివారం మీడియాతో చెప్పారు. కెసిఆర్, బీజేపీ ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆహ్వానం అందలేదు అని అనుకోవచ్చు. కానీ, కేంద్రంలో బీజేపీకి బయటనుండి మద్దతిస్తున్న జగన్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడంతో ఆయనని పక్కకి పెట్టి జనసేన-టీడీపీ కూటమికి మద్దతిస్తున్నట్లే అని అర్ధమవుతుంది.